
తిరుపతి, 30 మార్చి (హి.స.)
జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నాయుడుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అధికారిక సమావేశాల్లో కూడా సీఎం పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం ఉదయం 11.30 గంటలకు దొరవారిసత్రం మండలం నెల్లబల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి పుదూరు గ్రామానికి వెళ్లి.. కొత్తగా నిర్మించిన ఏపీ టిడ్కో గృహాలను ప్రారంభించనున్నారు. గృహ నిర్మాణ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఇది మరో ముఖ్య అడుగుగా భావిస్తున్నారు.
మధ్యాహ్నం 12.40 గంటలకు పుదూరు గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.40 గంటలకు నాయుడుపేట మండలంలోని బిరదవాడ గ్రామంలో రాజకీయ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 4.20 గంటలకు నెల్లబల్లి గ్రామంలోని హెలిప్యాడ్ నుంచి బయల్దేరి తిరుపతిలోనిశ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు సీఎం వెళ్లనున్నారు. అక్కడ కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది. ఈ పర్యటన ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అధికారులు తెలిపారు. స్థానికంగా సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ