రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి
రాజన్న సిరిసిల్ల, 29 మార్చి (హి.స.) చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని, ధర్మారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన ముడుకే లక్
Crime


రాజన్న సిరిసిల్ల, 29 మార్చి (హి.స.)

చెరువులో పడి ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని, ధర్మారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ధర్మారం గ్రామానికి చెందిన ముడుకే లక్ష్మీరాజామ్(58), కుమ్మం మొండయ్య(50) అనే ఇద్దరు గొర్రెల కాపరులు తమ గొర్రెల మందతో కలిసి ఉదయం గ్రామం శివారులోని చెరువు వద్దకు వెళ్లారు. గొర్రెలకు నీరు తాగించే క్రమంలో మూడు గొర్రెలు ప్రమాదవశాత్తు నీటిలోకి వెళ్లాయి. వాటిని కాపాడే క్రమంలో ఇద్దరు గొర్రెల కాపరులు అదుపుతప్పి నీట మునిగి లోతట్టు ప్రాంతానికి వెళ్లగా ఈతగాళ్ల సహాయంతో చెరువులో గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం గొర్రెలు తీసుకుని వెళ్లిన వారు ఇద్దరు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెంది చెరువు వద్దకు వెళ్లి చూడగా అక్కడ గొర్రెలు మాత్రమే కనిపించాయి. ఈ విషయం పై వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. సమాచారం అందుకున్న కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు గొర్రెల కాపరుల మృతదేహాలు లభ్యం కావడంతో ధర్మారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి ఇద్దరు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు గ్రామంలో మిన్నంటాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande