
హైదరాబాద్, 29 మార్చి (హి.స.)
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రచ్చకు దారితీసింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి.. చేతితో సైగ చేస్తూ గన్ తో కాలుస్తానని అన్నారని సీఎం ఆరోపించారు. అతని ప్రవర్తన అంతా వీడియో కెమెరాల్లో రికార్డయిందని పేర్కొన్నారు. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే.. అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయన్నారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించి, ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బీఆర్ఎస్ సభ్యులు సభకు సహకరిస్తేనే సభలో ఉంచాలని, అడ్డుకునే శైలి ఉంటే.. తదుపరి సమావేశాల వరకూ సస్పెండ్ చేయాలని రేవంత్ కోరారు. దీంతో కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ.. అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు