
అమరావతి, 30 మార్చి (హి.స.)
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్లో అంచెలంచెలుగా ఎదిగి.. పలు హోదాల్లో నారాయణరావు పనిచేశారు. నేడు ఆయన లొంగుబాటును ఏపీ డీజీపీ అధికారికంగా ధృవీకరించనున్నారు. నారాయణ రావు లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
లక్ష్యం మార్చి 31..
ఇదిలా ఉంటే.. గత ఏడాది కాలంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా బలగాలు ‘ఆపరేషన్ కగార్’ వంటి భారీ ఆపరేషన్లతో మావోయిస్టుల కోటలను బద్దలు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిజం అడ్రస్ ఉండకూడదని అమిత్ షా స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (AOB) రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న నారాయణ రావు లొంగిపోవడం హాట్ టాపిక్గా మారింది. నారాయణ రావు లొంగుబాటుతో ఏఓబీలో మావోయిస్టుల ఉనికి దాదాపు శూన్యమైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV