
హైదరాబాద్, 31 మార్చి (హి.స.)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి లో
(Kukatpally) మంగళవారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కైతలాపూర్ (Kaithalapur) రాఘవేంద్ర కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కాలనీకి చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులను హతమార్చి, అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతురాలి భర్త, ఇతర కుటుంబ సభ్యుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అయితే, ఒకే ఇంట్లో తల్లి, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడి ఉండటంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు