
ఢిల్లీ, 05 మార్చి (హి.స.)
ఇరాన్ (Iran) తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు రాజకీయంగా భారీ ఊరట లభించింది. ఇరాన్పై సైనిక చర్యలు చేపట్టే విషయంలో అధ్యక్షుడి అధికారాలను నియంత్రించాలని డెమొక్రాట్లు (Democrats) ప్రవేశపెట్టిన 'వార్ పవర్స్' తీర్మానం సెనేట్లో వీగిపోయింది. ఇవాళ జరిగిన ఓటింగ్లో ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 53-47 ఓట్లు రావడంతో తీర్మానం తిరస్కరణకు గురైంది. సెనేట్లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉండటంతో ఈ తీర్మానం వీగిపోవడం ముందే ఊహించినప్పటికీ, ఓటింగ్ మాత్రం ఆసక్తికరంగా సాగింది. రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ డెమొక్రాట్లతో కలిసి ఈ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. డెమొక్రాట్ సెనేటర్ జాన్ ఫెటర్మన్ తన పార్టీ నిర్ణయానికి భిన్నంగా ట్రంపు అనుకూలంగా ఓటు వేశారు. యుద్ధం జరుగుతున్న కీలక సమయంలో సైనికులకు వెన్నుదన్నుగా నిలవాలి తప్ప, అధ్యక్షుడి చేతులను కట్టేయకూడదని రిపబ్లికన్ సెనేటర్లు వాదించారు. అయితే, అమెరికా పార్లమెంటు ముందస్తు అనుమతి లేకుండా ఇరాన్పై ఎటువంటి సైనిక దాడులు నిర్వహించకుండా అధ్యక్షుడిని అడ్డుకోవడం ఆ తీర్మానం ప్రధాన ఉద్దేశం. ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ను పక్కన పెడుతున్నారని, యుద్ధానికి మారుతున్న కారణాలను చెబుతున్నారని డెమొక్రాట్లు ఆరోపించారు. 8 వారాల పాటు యుద్ధం? మరోవైపు, ఇరాన్పై జరుగుతున్న దాడుల కాలపరిమితిపై అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం మరో 8 వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. గత వారాంతంలో ట్రంప్ చెప్పిన కాలపరిమితి కంటే ఇది దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. గత శనివారం నుంచి అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు ప్రారంభించగా, ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులతో విరుచుకుపడుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..