
చండీగఢ్/ఢిల్లీ, 07మార్చి (హి.స.): డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్- హర్యానా హైకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రామ్ రహీమ్ తరపు న్యాయవాది జితేందర్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు.
2002లో హర్యానాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, ఆపై చికిత్స పొందుతూ ఆయన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు నాడు వినవచ్చాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, 2019లో గుర్మీత్ రామ్ రహీమ్ సహా మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ, డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం జరిగిన విచారణలో సాక్ష్యాధారాల లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ, కేసు నుంచి విముక్తి కల్పించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు