
హైదరాబాద్, 05 మార్చి (హి.స.)
తాను రీల్ హీరో మాత్రమే కాదు
రియల్ హీరో అని మరోసారి నిరూపించుకున్నాడు నటుడు సోనూసూద్. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో వందలాది మంది దుబాయ్ లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికుల పట్ల రియల్ హీరో సోనూసూద్ తన ఉదారతను చాటుకున్నారు. విదేశీ గడ్డపై దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, అక్కడ ఇబ్బంది పడుతున్న వారందరికీ ఉచితంగా వసతి కల్పించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సహాయం అందించడానికి ఆయన ఎటువంటి షరతులు విధించకపోవడం గమనార్హం. కేవలం భారతీయులకే కాకుండా, ఏ దేశానికి చెందిన ప్రయాణికులైనా సరే, ఆపదలో ఉన్నప్పుడు మానవత్వమే ముఖ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోనూసూద్ తెలిపారు.
కరోనా కష్టకాలంలో లక్షలాది మంది వలస కార్మికులను క్షేమంగా వారి ఇళ్లకు చేర్చి 'ప్రజా మనిషి'గా గుర్తింపు పొందిన సోనూసూద్... ఇప్పుడు విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి దిగడం విశేషం. దుబాయ్ ఉండి సరైన వసతి దొరకక ఇబ్బందులు పడుతున్న వారు నేరుగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మెసేజ్ చేయాలని ఆయన సూచించారు. అలా మెసేజ్ చేసిన వెంటనే తన టీమ్ బాధితులను సంప్రదించి, వారికి అవసరమైన వసతి ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు. యుద్ధం కారణంగా విమాన ప్రయాణాలు నిలిచిపోయి ఆందోళనలో ఉన్న వేల మందికి సోనూసూద్ చేసిన ఈ ప్రకటన ఒక పెద్ద ఊరటనిస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు