దంచికొడుతున్న ఎండలు.. మార్చి మొదటి వారంలోనే
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Summer


హైదరాబాద్, 07 మార్చి (హి.స.)తెలంగాణలో మార్చి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి. ఉదయం11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ విభాగం అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 34 నుంచి 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.

ఈరోజు, రేపు పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈరోజు భద్రాచలం, మహబూబ్నగర్ జిల్లాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, ఖమ్మంలో 38 డిగ్రీలు.. రామగుండెం, నిజామాబాద్, హైదరాబాద్, దుండిగల్, హకీంపేట్ ప్రాంతాల్లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

శనివారం(మార్చి 7) నుంచి సోమవారం(మార్చి 9) వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనూ గత రెండు రోజుల్లో 2 డిగ్రీలు పెరిగాయని అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు పైబడితే వడగాలుల అలర్ట్ జారీ చేస్తామని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande