
వనపర్తి, 07 మార్చి (హి.స.)
స్వచ్చదనం-పచ్చదనం విజయవంతం
అవ్వాలంటే ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఎకో పార్క్ సమీపంలో నిర్వహించిన స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన స్వయంగా శ్రమదానం చేసి పార్క్ పరిసరాల్లో ఉన్న చెత్తను తొలగించారు. కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ తట్టలు పట్టుకొని చెత్తను పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇండ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా అనేక భవిష్యత్తులో సీజనల్ వ్యాధులను నివారించవచ్చని అన్నారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలు కూడా ఈ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని స్వచ్చమైన పరిసరాల నిర్మాణానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీపీఆర్ సీతారాం, సీపీవో హరికృష్ణ, డివైఎస్ఓ సుధీర్ రెడ్డి, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు