
అమరావతి, 07 మార్చి (హి.స.)
ఆపరేషన్ వజ్రప్రహర కార్యక్రమంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రాష్ట్రమంతటా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. వివిధ జిల్లాల్లో 100కు పైగా పోలీసు బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సరైన ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. అలాగే ప్రతీ ఏరియాలో నివాసం ఉంటున్న వారి ధృవీకరణ పత్రాలను తనిఖీ చేస్తున్నారు. సరైన ధృవపత్రాలు చూపని నివాసితుల్ని ప్రశ్నిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు, గంజాయి విక్రయాలపై కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యం.. రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ఈ భారీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. రాష్ట్రంలో గంజాయి నెట్ వర్క్ ను కూకటివేళ్లతో సహా తొలగించడమే ఈ డ్రైవ్ లక్ష్యం. ముఖ్యంగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి జరుగుతున్నఅక్రమ రవాణాను అడ్డుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా గంజాయి పాతనేరస్తుల కదలికలను గమనిస్తూ.. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షించడంపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో నిరంతరం నిఘా ఉండేలా చర్యలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ లు నిర్వహిస్తూ.. గంజాయి స్మగ్లింగ్ ను అరికట్టడంలో రాష్ట్ పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV