
ఢిల్లీ, 07మార్చి (హి.స.) దేశ రాజధానిలో జరిగిన హోలీ సంబరాలు విషాదానికి దారితీశాయి. రంగుల పండుగ వేళ జరిగిన స్వల్ప వివాదం చివరికి యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. నైరుతి ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో 26 ఏళ్ల తరుణ్ అనే యువకుడు దారుణ హత్యకు గురికావడంతో శుక్రవారం ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 4న హోలీ వేడుకల సందర్భంగా జేజే కాలనీలోని ఒక ఇంటి పైకప్పు నుంచి 11 ఏళ్ల బాలిక నీటి బెలూన్లను కింద ఉన్న తన బంధువులపైకి విసురుతోంది. అయితే, ప్రమాదవశాత్తూ ఆ రంగు నీళ్లు మరో వర్గానికి చెందిన మహిళపై పడ్డాయి. ఇది ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ మహిళ తన కుటుంబ సభ్యులు, మరికొందరితో కలిసి తరుణ్ కుటుంబంపై దాడికి దిగారు. తరుణ్‌ను 10 మంది చుట్టుముట్టి కర్రలు, రాడ్లు, రాళ్లతో విచక్షణారహితంగా కొట్టారు. తలకి తీవ్ర గాయాలవ్వడంతో తరుణ్‌ను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ దాడిలో తరుణ్ తాత మాన్ సింగ్‌తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులు కూడా గాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు