
అమరావతి, 08 మార్చి (హి.స.)
ఆళ్లగడ్డ గ్రామీణం: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి మూలమూర్తిని పంచామృతాలతో అభిషేకించి నిత్య ఆరాధనలు చేశారు. ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి, సుదర్శన మూర్తి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ముఖద్వార మండపంలో కొలువుంచారు. స్వామి, అమ్మవారికి ఎదురుగా హోమగుండం ఏర్పాటు చేసి అర్చకులు వేదమంత్రాలతో సుదర్శన హోమం జరిపారు. ఈ కైంకర్యాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు . అర్చకులు స్వామి అమ్మవార్లకు మంగళహారతి అందించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, మనీయార్ సౌమ్య నారాయణన్ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ