
అమరావతి, 08 మార్చి (హి.స.)కానూరు, న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. శనివారం కానూరు పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ‘ఈనాడు- ఈఎఫ్ఎం 91.9’ సత్యభామ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిశ్రమలు స్థాపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కని ప్రోత్సాహం అందిస్తున్నారని, సాంకేతిక విద్యార్థినులు ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. నేటి తరం మహిళలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుని..ఎలాంటి సమస్యనైనా తట్టుకునేలా మానసిక స్థైర్యం పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ పి.తేజస్వి మాట్లాడుతూ..ఈనాడు వసుంధర పేజీలో విజయాలు సాధించిన మహిళల కథనాలు ఇస్తుంటారని, చిన్ననాటి నుంచి వాటిని చదివి స్ఫూర్తి పొందానన్నారు. మీరు కూడా విజయం సాధించి అందులో స్థానం సంపాదించాలని కోరారు. ప్రముఖ న్యూట్రిషియన్ గుమ్మా సుష్మ మాట్లాడుతూ..
లక్కీడ్రా విజేతలకు నగదు బహుమతులు అందజేస్తున్న జోయాలుక్కాస్ ప్రతినిధులు
ప్రస్తుతం మహిళల్లో ప్రతి ముగ్గురిలో ఒక్కరికీ రక్తహీనత ఉందన్నారు. అలాంటి వారు శనగలు, పెసలు, అలసందలు, వంటివి తీసుకోవడంతో పాటు, నిమ్మ, ఉసిరికాయలను ఎక్కువగా తినాలన్నారు. పీవీపీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ కొండపల్లి శివాజీ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలకు అన్నిరంగాల్లో అవకాశాలు పెరిగాయన్నారు. ప్రతి పురుషుడి విజయం వెనక మహిళలు ఉంటారన్నారు. జోయాలుక్కాస్ విజయవాడ బ్రాంచి మేనేజర్ దేవదాస్ మాట్లాడుతూ.. మహిళలను ప్రోత్సహించే కార్యక్రమాలను తమ సంస్థ తరఫున ఎప్పుడూ నిర్వహిస్తుంటామన్నారు. విజయవాడ ఈనాడు యూనిట్ మేనేజర్ సీహెచ్ కృష్ణకిశోర్ మాట్లాడుతూ.. మహిళలకు అన్నిరంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎంబీఏ విభాగాధిపతి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా కళాశాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల నృత్యాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల వేషధారణలతో కూడిన ర్యాంప్వాక్, సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జోయాలుక్కాస్ ప్రధానభాగస్వామిగా వ్యవహరించగా, రామోజీ ఫిల్మ్సిటీ, ప్రియ ఫుడ్స్ గిఫ్ట్ స్పాన్సర్లుగా సహకరించారు. వ్యాఖ్యాతగా ఆర్జే లహరి వ్యవహరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ