సీఎం వార్నింగ్ తో రూట్ మార్చిన కలెక్టర్లు.. ఫీల్డ్ విజిట్ కు పరుగులు..
హైదరాబాద్, 08 మార్చి (హి.స.) మొన్నటి వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటి గ్రామాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడని కలెక్టర్లు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ తో రూటుమార్చారు. తెల్లారితే చాలు మెజార్టీ కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు పరుగులు పె
CM warning


హైదరాబాద్, 08 మార్చి (హి.స.)

మొన్నటి వరకు జిల్లా హెడ్ క్వార్టర్స్ దాటి గ్రామాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడని కలెక్టర్లు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ తో రూటుమార్చారు. తెల్లారితే చాలు మెజార్టీ కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు పరుగులు పెడుతున్నారు. తమ జిల్లా పరిధిలోని ఆస్పత్రులు, గురుకులాలు, స్కూల్స్ లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసు కుంటున్నారు. పిల్లలతో కలిసి లంచ్ చేస్తున్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పథకాలను పరిశీలిస్తున్నారు. తమ ఫీల్డ్ విజిట్ వివరాలను సీఎంఓ, సీఎస్ కు రిపోర్ట్ చేస్తున్నారు.

ప్రతి కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని, అప్పుడే ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి తెలుస్తుందని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనను మెజార్టీ కలెక్టర్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ నెల 3న సెక్రెటేరియట్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో మాత్రం ఫీల్డ్ విజిట్ అంశాన్ని సీఎం సీరియస్ గా తీసుకున్నారు. నెలలో కనీసం పది రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటలనకు వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఈ నెల 4 నుంచి కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఉదయాన్నే కలెక్టర్ బంగ్లా నుంచి బయటకు వచ్చి గ్రామాల్లోని స్కూల్స్, గురుకులాలు, ఆస్పత్రుల ఆకస్మిక తనిఖీలకు వెళ్తున్నారు. గురుకులాల్లో పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలిస్తున్నారు. కొందరు వారితో కలిసి లంచ్ చేస్తున్నారు. కొందరు కలెక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి, రోగులకు అందిస్తున్న ట్రీట్మెంట్ వివరాలను ఆరా తీస్తున్నారు. మరికొందరు కలెక్టర్లు గ్రామాల్లో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 16 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. పిల్లలకు పబ్లిక్ ఎగ్జామ్స్ పట్ల కాస్త భయం, బెరుకు ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన కొందరు కలెక్టర్లు పరీక్షల సమయంలో రిలాక్స్ గా ఉండాలని, ఆందోళన చెందవద్దని కౌన్సెలింగ్ ఇస్తున్నారు. దీంతో పిల్లలకు కాస్త మనోధైర్యం కలుగుతుందని టీచర్లు,పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు.

సీఎం ఆదేశాలతో సెక్రెటేరియట్ లో పని చేస్తున్న ఐఏఎస్ లు సైతం ఫీల్డ్ విజిట్ కు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా శుక్రవారం ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు చెందిన అన్ని సెక్షన్లను తనిఖీ చేశారు. స్టాఫ్ హాజరు శాతాన్ని ఆరా తీశారు. ఫైల్స్ పెండింగ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

నాలుగు రోజులుగా ఫీల్డ్ విజిట్ కు వెళ్లిన కొందరు కలెక్టర్ల వివరాలు..

సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగర్వాల్ బోయినపల్లి కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన ఆశ్రయ ఆకృతి అంధ విద్యార్థుల ఆశ్రమాన్ని సందర్శించారు.

వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి కస్తూరి కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్ వాడీ కేంద్రాలను తనిఖీ చేసి పిల్లలతో కలిసి భోజనం చేశారు

భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రభుత్వ ఆస్పత్రి, బాలసదన్ ను సందర్శించారు.

పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మంథని పట్టణం, రాఘవపూర్ లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని, గర్భిణుల చెకప్, వ్యాక్సినేషన్ పై అక్కడి డాక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేశారు.

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోదాడ క్రాస్ రోడ్ లోని ఎస్సీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి ఫీల్డ్ లో పర్యటించారు. క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టి పారిశుధ్య పనులను పరిశీలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, కేజీబీవీ పాఠశాలను పరిశీలించారు.

-జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బచ్చన్నపేట మండలకేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్పాహారం, మెస్ నిర్వహణపై విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande