
హైదరాబాద్, 08 మార్చి (హి.స.)*
హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు త్వరితగతిన సమస్యల పరిష్కారం అందించేందుకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా జిహెచ్ఎంసీ కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగరంలోని పారిశుద్ధ్య సమస్యలను ఇప్పుడు పౌరులు నేరుగా వాట్సాప్ ద్వారా జీహెచ్ఎంసీకి తెలియజేయవచ్చు.
రోడ్లపై చెత్త పేరుకుపోవడం, చెత్త బిన్లు నిండిపోవడం, చెత్త సకాలంలో తొలగించకపోవడం, మురుగునాళాలు మూసుకుపోవడం (డీసిల్టింగ్ అవసరం), గ్రీన్ వెస్ట్ తొలగింపు వంటి పారిశుద్ధ్య సమస్యలను పౌరులు సులభంగా తెలియజేయవచ్చు. సమస్యకు సంబంధించిన ఫోటోతో పాటు లొకేషన్‌ను 8125966586 నంబర్‌కు వాట్సాప్ ద్వారా పంపితే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతారు.
ఈ వాట్సాప్ సౌకర్యం ద్వారా పౌరులు ఎలాంటి కార్యాలయాలకు వెళ్లకుండా, సులభంగా తమ ప్రాంతాల్లో ఉన్న పారిశుద్ధ్య సమస్యలను జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత పారిశుద్ధ్య బృందాలను అప్రమత్తం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు.
ఈ విధానం ద్వారా పౌరులు – జీహెచ్ఎంసీ మధ్య సమన్వయం మరింత మెరుగుపడి, నగర పారిశుద్ధ్య నిర్వహణ వ్యవస్థ మరింత బలపడుతుందని అధికారులు తెలిపారు.
పౌరుల్లో అవగాహన కల్పించేందుకు వాట్సాప్ ద్వారా పారిశుద్ధ్య సమస్యలను ఎలా తెలియజేయాలనే అంశంపై ఒక అవగాహన వీడియోను కూడా జీహెచ్ఎంసీ ఆదివారం విడుదల చేసింది.
*పౌరుల సహకారంతోనే క్లీన్, గ్రీన్ సిటీగా హైదరాబాద్*:* జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్
హైదరాబాద్‌ను పరిశుభ్రమైన, హరిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగర పౌరులు కూడా తమ సహకరించాలని
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ కోరారు. నగర ప్రజల తోడ్పాటు, సహకారం ఉంటే హైదరాబాద్ క్లీన్ , గ్రీన్ సిటీ గా అవతరిస్తుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు