
ఖమ్మం, 08 మార్చి (హి.స.)
హెచ్.పి.వి వ్యాక్సినేషన్తో మహిళలకు
ఈ గర్భాశయ క్యాన్సర్ రాకుండా నివారించవచ్చని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జనరల్ ఆసుపత్రిలోని రేడియాలజీ హబ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెచ్.పి.వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ, మహిళలకు వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్ వచ్చిందని అన్నారు. కౌమార బాలికలకు హెచ్.పీ.వి. టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గర్భాశయ క్యాన్సర్ ను కట్టడి చేసే అవకాశం ఉంటుందని, ఒకే మోతాదులో ఇవ్వనున్న హెచ్.పి.వి. టీకా గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షణ కల్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, టీకా సురక్షితమైనదని, ఖమ్మం జిల్లాలో ఉన్న బాలికలకు తల్లిదండ్రుల ఆమోదంతో ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా హెచ్.పీ.వి. టీకా వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
హెచ్.పీ.వి. టీకా వేసుకోవడం వల్ల కలిగే లాభాలను తల్లిదండ్రులకు విస్తృతంగా వివరించి, అధిక సంఖ్యలో బాలికలకు టీకా అందేలా చూడాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు. అనంతరం బిఎస్సీ నర్సింగ్ విద్యార్థినులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హెల్త్ కేర్ లో నర్సులకు ప్రస్తుతం బాగా డిమాండ్ ఉందని తెలిపారు. ఆసుపత్రిలో పని చేసే అవకాశాలు మాత్రమే కాకుండా మన దేశంలో రోజు రోజుకు వృద్ధులను చూసుకునేందుకు నర్సుల అవసరం పెరుగుతోందని అన్నారు.
బీఎస్సీ నర్సింగ్ కోర్సు విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అనేక అవకాశాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు. చదువుకునే సమయంలో ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో నర్సులు కొంత కాలం పని చేయడం వల్ల వారికి మంచి అనుభవం కలుగుతుందని, గ్రామీణ ప్రాంతంలో పరిస్థితులు గురించి అవగాహన పొంది భవిష్యత్తులో విధుల నిర్వహణ సమయంలో మెరుగ్గా పని చేయగలుగుతారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, డిసిహెచ్ఎస్ రాజశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, ఆర్ఎంఓ డా. రాంబాబు, డా. రాజేంద్రప్రసాద్, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు