హుజూరాబాద్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సస్పెన్షన్
కరీంనగర్, 08 మార్చి (హి.స.) విధుల పట్ల నిర్లక్ష్యం,అధికార దుర్వినియోగానికి పాల్పడిన హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారి డి.చందనపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను సస్పెండ్ చేస్తూ వరంగల్ జాయింట్ లేబర్ కమిషనర్ వినీత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణల
సస్పెన్షన్


కరీంనగర్, 08 మార్చి (హి.స.)

విధుల పట్ల నిర్లక్ష్యం,అధికార దుర్వినియోగానికి పాల్పడిన హుజూరాబాద్ సహాయ కార్మిక అధికారి డి.చందనపై ప్రభుత్వం వేటు వేసింది. ఆమెను సస్పెండ్ చేస్తూ వరంగల్ జాయింట్ లేబర్ కమిషనర్ వినీత ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో వెల్లడైన పలు అంశాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా దరఖాస్తుల పెండింగ్,భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలకు సంబంధించి వచ్చిన అనేక దరఖాస్తులను క్లియర్ చేయకుండా కావాలనే పెండింగ్లో ఉంచారు. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరు అయ్యేవారు.

నిర్వహణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మరియు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. విచారణ నివేదిక ఆధారంగా చందనపై వచ్చిన ఫిర్యాదులపై కరీంనగర్ డిప్యూటీ లేబర్ కమిషనర్ మరియు అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. వారు సమర్పించిన తుది నివేదికలో ఆరోపణలు నిజమని తేలడంతో, జాయింట్ కమిషనర్ వినీత తక్షణమే ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్ కాలంలో ఆమెపై శాఖాపరమైన తదుపరి చర్యలు కూడా కొనసాగుతాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande