హాకీ పండగ.. గచ్చిబౌలిలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ప్రారంభం
హైదరాబాద్, 08 మార్చి (హి.స.) భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా వేదికకు సాక్ష్యంగా నిలిచింది. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ‘మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్–2026’ పోరు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH), తెలంగాణ ప్రభుత్వ
హాకీ పండగ.. గచ్చిబౌలిలో వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ప్రారంభం


హైదరాబాద్, 08 మార్చి (హి.స.)

భాగ్యనగరం మరో అంతర్జాతీయ క్రీడా వేదికకు సాక్ష్యంగా నిలిచింది. గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ‘మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్–2026’ పోరు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH), తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్‌లో ఎనిమిది దేశాల జట్లు పోటీపడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో క్రీడా శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

*ముఖ్య అతిథిగా సైబరాబాద్ సీపీ*

తొలిరోజు మ్యాచ్‌లకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి పోటీలు నగరంలో నిర్వహించడం యువ క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. మ్యాచ్ లకు సంబంధించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SATG) వైస్ చైర్మన్ & ఎండీ డా. ఏ. సోనిబాలా దేవి కూడా పాల్గొన్నారు.

*మైదానంలో హోరాహోరీ..*

మొత్తం ఎనిమిది జట్లు రెండు పూల్‌లుగా విడిపోయి లీగ్ దశలో తలపడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఇంగ్లాండ్–ఇటలీ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభమైంది. అనంతరం కొరియా–ఆస్ట్రియా, స్కాట్లాండ్–వేల్స్ జట్లు పోటీ పడ్డాయి. రాత్రి 7:30 గంటలకు జరిగే భారత్–ఉరుగ్వే మ్యాచ్‌పై అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. స్వదేశీ గడ్డపై భారత మహిళల జట్టు బోణీ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

*టోర్నీ షెడ్యూల్ ఇలా..*

పూల్–ఏ: ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా

పూల్–బీ: భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్

లీగ్ మ్యాచ్‌లు: మార్చి 8, 9 మరియు 11 తేదీల్లో జరుగుతాయి.

నాకౌట్ పోరు: మార్చి 13న సెమీ ఫైనల్స్, మార్చి 14న రాత్రి 7:30 గంటలకు ఫైనల్ మ్యాచ్.

విశ్రాంతి: మార్చి 10 మరియు 12 తేదీల్లో జట్లకు విశ్రాంతి.

*అతిథులకు తెలంగాణ ఆతిథ్యం*

స్టేడియంలో అత్యాధునిక ఆస్ట్రో టర్ఫ్, హై-ప్రొఫైల్ భద్రతతో పాటు విదేశీ క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రీడాకారులకు తెలంగాణ సంస్కృతిని పరిచయం చేసేలా వారసత్వ కట్టడాల సందర్శన (హెరిటేజ్ టూర్లు) కూడా షెడ్యూల్‌లో చేర్చారు.

2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ టోర్నీలో రాణించిన జట్లు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించనున్నాయి. హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో మెరిసిపోతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande