
అమరావతి, 08 మార్చి (హి.స.) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగింటి ఆడపడుచులు, తల్లులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టారు. ఆడపిల్లలకు ఆస్తిలో సమానహక్కు ఇవ్వడం నుంచి మొదలైన మహిళా సాధికారత ప్రస్థానం.. నేడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే వరకూ కొనసాగుతోందన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను కూడా అమలు చేస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహించి దాని ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మంది మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అంగన్ వాడి కార్యకర్తలు, ఆశావర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నామని వివరించారు. అలాగే 5 లక్షల మంది మహిళా పారిశ్రమికవేత్తల్ని తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని.. ఇప్పటివరకూ లక్షమంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశామని తెలిపారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలను సాధించేందుకు అందరి సహకారం, భాగస్వామ్యం కోరుతున్నట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV