
కడప,, 09 మార్చి (హి.స.)కడప జిల్లా రాజంపేటలో గంజాయి ముఠా తీవ్ర కలకలం సృషించింది. స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గంజాయి మత్తులో ఉన్న కొందరు యువకులు వీరంగం సృష్టించి, ఒక ప్రైవేట్ హాస్టల్ యజమానిని రోడ్డుపై తిప్పుతూ కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో సదరు వ్యక్తితో పాటు మరికొంతమంది గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
రాజంపేటలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో గిరి అనే వ్యక్తి ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గంజాయి మత్తులో ఉన్న కొంతమంది యువకులు గిరిపై ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. విధిలో తిప్పుతూ.. గిరిని విచక్షణారహితంగా కొట్టారు. గంజాయి మత్తులో ఊగిపోతూ వారు చేసిన ఈ దాడిని చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.
ఈ దాడి గంజాయి మత్తులో జరిగినదే అయినా, దీని వెనుక వేరే కారణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో మరో ప్రైవేట్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి, వ్యాపార శత్రుత్వంతోనే ఈ గంజాయి బ్యాచ్ని పంపి దాడి చేయించి ఉండొచ్చని బాధితుడు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ