
జనగామ, 09 మార్చి (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి వారి చదువు స్థాయిని తెలుసుకున్నారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనలో నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో పరిశుభ్రత పాటించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకొని ఉగాది పండుగకు గృహప్రవేశం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతతో ఇళ్ల నిర్మాణం జరగాలని, పనులు ఆలస్యం కాకుండా అధికారులు పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. గ్రామంలోని రోడ్ల పై పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు.
రోడ్ల పై చెత్త పేరుకుపోకుండా ప్రతిరోజూ శుభ్రత పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెత్తను సమయానికి సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు వంటి పోషకాహార పంపిణీ విధానాన్ని పరిశీలించారు. చిన్నారుల హాజరు, ఆరోగ్య పరీక్షలు, బరువు, ఎత్తు నమోదు వంటి అంశాలను తనిఖీ చేశారు. తానే స్వయంగా చిన్నారుల బరువును తూగి, ఎత్తును కొలిచారు. గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బచ్చన్నపేట మండలంలో ప్రజల ఇళ్లకు వెళ్లి ఆకస్మికంగా సందర్శించి వారితో మాట్లాడారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా నిర్ణయించిన చెత్త సేకరణ కేంద్రాలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నీటి తొట్టెలపై తప్పనిసరిగా మూతలు పెట్టుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు