
మేడ్చల్ మల్కాజ్గిరి, 09 మార్చి (హి.స.)
దివ్యాంగుల ఆర్థిక సంక్షేమానికి అన్నివేళలా కృషి చేస్తున్నామని మేడ్చల్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. సోమవారం అల్వాల్ సఖి సెంటర్లో దివ్యాంగులకు 63 వెహికల్స్, వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ వాహనాల ద్వారా తమ తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకొని వ్యాపారం ఇతర వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగించుకోవాలని కోరారు. వాహనం ఉంది కదా అని దానిని సరైన పద్దతిలో మెయింటెనెన్స్ చేయక పక్కన పెట్టడం కాకుండా దానిని సరైన పద్ధతిలో వాడుకోవాలని కోరారు. వాహనం లేకముందు కదలలేని వారు వాహనం వచ్చిన తర్వాత తమకున్న సామర్థ్యాలను ఉపయోగించుకొని దైనందిన జీవితానికి ఉపయోగపడే విధంగా వాడుకోవాలని కోరారు. దివ్యాంగులు శక్తిహీనులు ఏమి కారని వారికి అనేక శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాటిని వెలికి తీసే విధంగా ముందుకు పోవాలని కోరారు. దివ్యాంగులకు సోషల్ వెల్ఫేర్ సహకారంతోపాటు కలెక్టరేట్ నుండి కావలసిన సహాయాన్ని అందించి దివ్యాంగులను అభివృద్ధి మార్గం పట్టించేందుకు మా వంతు కృషి ఎప్పుడు ఉంటుందని తెలిపారు. అంతకుముందు అల్వాల్ తహసీల్దార్ రాములు, ఆర్డీవో శ్యాం ప్రకాష్, జిల్లా సంక్షేమ అధికారి శారద తదితరులు దివ్యాంగుల శక్తిసామర్థ్యాలను వారు సాధించిన విజయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సఖి సెంటర్ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు