ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ కోసం తెలంగాణ క్రీడాకారులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
TG


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ కోసం తెలంగాణ క్రీడాకారులకు పూర్తి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. క్రీడాశాఖపై సచివాలయంలో ఈరోజు(సోమవారం) మంత్రులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు మైదానాల ఏర్పాటుపై చర్చించారు.

ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు వీలుగా తెలంగాణలో అన్ని సౌకర్యాలతోపాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాలు ఉండాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఒలింపిక్స్ క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తామని వ్యాఖ్యానించారు. గచ్చిబౌలి అవుట్ డోర్ స్టేడియాన్ని పునరుద్ధరించడంతోపాటు, స్టేడియం ఆవరణలో ఇండోర్ స్టేడియం, యూనివర్సిటీ కాంప్లెక్స్, హాస్టల్ భవనాలు, అన్ని రకాల క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన ఇతర సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ నిర్మాణాలకు సంబంధించి పలు డిజైన్లను పరిశీలించారు. ఈ డిజైన్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఒలింపిక్స్, కామన్ వెల్త్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇచ్చేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారుల సత్తా చాటడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మార్గనిర్దేశం చేశారు. నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఎల్బీ స్టేడియం, సరూర్ నగర్ స్టేడియాలను భవిష్యత్ అవసరాలు, శిక్షణ, పోటీలకు అనుగుణంగా ఆధునీకరించాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, SAT చైర్మన్ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, SAT ఎండీ సోనీ బాలదేవి, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ జి. కిషోర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande