తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ : రామగుండం NTPC ఒప్పందంపై సీఎం రేవంత్ కి కిషన్ రెడ్డి లేఖ
హైదరాబాద్, 09 మార్చి (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రామగుండం ఎన్టీపీసీ (NTPC) నిర్మిస్తున్న రెండో దశ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి క
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 09 మార్చి (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రామగుండం ఎన్టీపీసీ (NTPC) నిర్మిస్తున్న రెండో దశ థర్మల్ పవర్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (PPA) చేసుకోవాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. రామగుండంలో ఎన్టీపీసీ ఏర్పాటు చేయాల్సిన 4,000 మెగావాట్ల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మొదటి దశ (2X800 MW) పూర్తి కావడమే కాకుండా, 2023లోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీనిని జాతికి అంకితం చేశారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు రెండో దశలో భాగంగా 3×800 (2,400) మెగావాట్ల సామర్థ్యం గల మూడు యూనిట్లను ఎన్టీపీసీ చేపట్టనుందని, ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో 85 శాతాన్ని కేవలం తెలంగాణకే సరఫరా చేయనున్నట్లు ఆయన వివరించారు.

రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్

రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. మార్చి 3, 2026న రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 18,139 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదైందని ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో గ్రిడ్ స్థిరత్వం కోసం అదనంగా 5,000 నుంచి 6,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో, ఎన్టీపీసీ ప్రాజెక్టు అత్యంత కీలకంగా మారుతుందని తెలిపారు.

తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్..

అత్యాధునిక 'అల్ట్రా సూపర్ క్రిటికల్' సాంకేతికతతో ఎన్టీపీసీ తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, గతంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టు పనితీరును ప్రశంసించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. బొగ్గు సమీకరణలో ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛనిస్తే, మరింత తక్కువ ధరకు నాణ్యమైన విద్యుత్తును అందించడం సాధ్యమవుతుందని, దీనివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు ఇద్దరికీ ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది.. అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఎన్టీపీసీతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని, తెలంగాణ కూడా వేగంగా స్పందించి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వ్యక్తిగత చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande