ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం
ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ తో పొత్తు ఎంఐఎం పార్టీ రద్దు చేసుకుంది
AIMIM's Asaduddin Owaisi


కోల్‌కతా, 10 ఏప్రిల్ (హి.స.) బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు స్టింగ్ ఆపరేషన్ వీడియో ఒకటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత హుమయూన్ కబీర్ స్థాపించిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ)తో పొత్తును రద్దు చేసుకుంది. బెంగాల్లో ఇకపై ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేసింది.

అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియోను విడుదల చేసింది. అందులో హుమయూన్ కబీర్.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీతో చేతులు కలిపినట్లు అంగీకరించారని టీఎంసీ ఆరోపించింది. ప్రధాని కార్యాలయంతో (పీఎంవో) తాను టచ్లో ఉన్నానని, రూ.1000 కోట్ల ప్రణాళికలో భాగంగా ఇప్పటికే రూ.200 కోట్లు అడ్వాన్స్గా అందుకున్నానని కబీర్ చెప్పినట్లు ఆ వీడియోలో ఉన్నట్లు టీఎంసీ పేర్కొంది. ముస్లింలను సులభంగా మోసం చేయవచ్చని ఆయన వ్యాఖ్యానించారని తెలిపింది. ఈ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరపాలని టీఎంసీ డిమాండ్ చేసింది.

అయితే, ఈ ఆరోపణలను హుమయూన్ కబీర్ తీవ్రంగా ఖండించారు. అది పూర్తిగా ఏఐ-జనరేటెడ్ వీడియో అని, తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక టీఎంసీ ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ సహా పలువురు టీఎంసీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

ఈ వివాదం నేపథ్యంలో ఎంఐఎం పార్టీ పొత్తును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ముస్లింల సమగ్రతను ప్రశ్నించే వ్యాఖ్యలతో మేం ఏకీభవించలేం. హుమయూన్ పార్టీతో మా పొత్తును ఈ రోజు నుంచి రద్దు చేసుకుంటున్నాం అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపింది. కాగా, పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande