మహారాష్ట్రలో ఘోర రోడ్డుప్రమాదం.. రెండు వాహనాలు ఢీ, నలుగురు దుర్మరణం
రెండు వాహనాలు ఢీ కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు
రోడ్డు ప్రమాదం


మహారాష్ట్ర, 12 ఏప్రిల్ (హి.స.)

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోపెను విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ తాలూకాలోని షాహా-పంచాలే రహదారిపై వేగంగా వచ్చిన ట్రక్కు ఒక పికప్ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం.. షిండేవాడి శివార్ సమీపంలో ఈ రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు ట్రక్కు ఆ పికప్ వాహనాన్ని సుమారు 100 అడుగుల దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో ఘర్షణ కారణంగా పికప్ వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో వాహనంలో ఉన్న ప్రయాణికులు ఒక ధార్మిక కార్యక్రమానికి హాజరై తిరిగి పంచాలే గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మంటల్లో చిక్కుకుని ముగ్గురు సజీవ దహనం కాగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో కిరణ్ రవి మోరే (23), శుభమ్ గణేష్ నవలే (21) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే.. ఈ ప్రమాదాన్ని చూసి దిగ్భ్రాంతికి.. మానసిక ఆందోళనకు లోనై మీరాబాయి విశ్వనాథ్ గాంగుర్డే (68) అనే వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది. ప్రమాదంలో మరణించినవారిలో మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వాహనం మంటలు అంటుకోవడానికి గల కారణాలపై పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande