
మీర్జాపూర్ 11 ఏప్రిల్ (హి.స.)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్లో ఇవాళ ఉదయం పట్టపగలే ఒక న్యాయవాదిని దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో, ప్రజల కళ్ల ముందే ఈ దారుణం జరగడం అక్కడి శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. వివరాల్లోకి వెళితే.. న్యాయవాది రాజీవ్ సింగ్ (Rajiv Singh) ఉదయం మార్నింగ్ వాక్ ముగించుకుని తిరిగి వస్తుండగా, బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనను అడ్డుకున్నారు. నిందితుల్లో ఒకరు తన వద్ద ఉన్న నాటు తుపాకీతో రాజీవ్ సింగ్ ఛాతీలోకి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజీవ్ సింగ్ను కాల్చిన తర్వాత నిందితులు పారిపోయేందుకు బైక్ ఎక్కారు. అయితే ఎంత ప్రయత్నించినా బైక్ స్టార్ట్ కాలేదు. నిందితులు పారిపోలేక బైక్ను నెట్టుకుంటూ వెళ్తుండగా, చుట్టుపక్కల వారు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, చేతిలో తుపాకీ ఉండటంతో ఎవరూ దగ్గరకు వెళ్లలేకపోయారు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత చివరకు బైక్ స్టార్ట్ అవ్వడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మీర్జాపూర్ ఎస్పీ అపర్ణ రజత్ కౌశిక్ మాట్లాడుతూ.. మృతుడు రాజీవ్ సింగ్ గతంలో ఓ గ్రామానికి సర్పంచ్గా కూడా పనిచేశారని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే పక్కా ప్లాన్ ప్రకారం అతడిని హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు