ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీ .. ఎలక్ట్రిక్ వాహనాల .. కొనుగోలుపై భారీ సబ్సిడీలు
ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై భారీ సబ్సిడీ ఇచ్చింది
Delhi government


న్యూఢిల్లీ, 11 ఏప్రిల్ (హి.స.)

వాయు కాలుష్యాన్ని అరికట్టి, పర్యావరణ హితమైన రవాణా వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా.. ఎలక్ట్రిక్ వాహన పాలసీ 2026-2030 ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ కొత్త పాలసీ ప్రకారం, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి గతంలో కంటే మెరుగైన నగదు ప్రోత్సాహకాలను (Incentives) ప్రకటించింది. ఈ పాలసీ ద్వారా 2030 నాటికి ఢిల్లీలోని మొత్తం వాహనాల్లో అత్యధిక శాతం విద్యుత్ వాహనాలే ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త నిబంధనలు మార్చి 31, 2030 వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

ఈ కొత్త పాలసీలో వాహనాల రకాన్ని బట్టి మొదటి మూడు సంవత్సరాల పాటు విభిన్న స్థాయిలో సబ్సిడీలను అందించనున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ల కొనుగోలుపై మొదటి ఏడాది గరిష్టంగా ₹30,000 వరకు, ఈ-ఆటోలపై ₹50,000 వరకు, ఎలక్ట్రిక్ గూడ్స్ వాహనాలపై అత్యధికంగా ₹1,00,000 వరకు నగదు ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, ఈ సబ్సిడీ మొత్తం ప్రతి ఏడాది క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి తోడు పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తుక్కుగా (Scrapping) మార్చి కొత్త ఈవీని కొంటే, కార్లపై అదనంగా ₹1,00,000 వరకు భారీ రాయితీని ప్రభుత్వం కల్పించింది.

వాహనదారులకు ఆర్థిక భారం తగ్గించేలా ఢిల్లీలో నమోదయ్యే ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుండి 100% మినహాయింపు ఇచ్చారు. అయితే, ఈ పూర్తి పన్ను మినహాయింపు కేవలం ₹30 లక్షల లోపు ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ సమగ్ర విధానం వల్ల ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగి, కాలుష్య నివారణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande