కందకుర్తి: డాక్టర్ హెడ్గేవార్ స్ఫూర్తి నిలయం
నిజామాబాద్ లోని కందకుర్తి డా. పరమ పూజ్యనీయ హెడ్గేవార్ స్పూర్తినిలయం. ఈరోజు శ్రీ కేశవ స్పూర్తి మందిరం ప్రారంభం అవుతుంది.
కందకుర్తి: డాక్టర్ హెడ్గేవార్ స్ఫూర్తి నిలయం


హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)

నిజామాబాద్ జిల్లా, కందకుర్తి డాక్టర్ హెడ్గేవార్ జీ ఇల్లు. ఇది ఒక దర్శనీయ స్థలం. హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు, ప్రతి వారిలో దేశభక్తి బీజాలు నాటేందుకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను స్థాపించిన పరమ పూజనీయ డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకుల స్వస్థలం తెలుగునేల మీది నిజామాబాద్ జిల్లాలోని ఈ కందకుర్తి. కొన్ని దశాబ్దాల క్రితమే ఆ వంశీకులు మహారాష్ట్ర వలసవెళ్లారు. డాక్టర్జీ అక్కడే జన్మించారు

తెలుగు ప్రాంతాల నుండి మహారాష్ట్ర వెళ్లిన స్వయంసేవకులను డాక్టర్జీ కందకుర్తి గురించి అడిగేవారట. ‘హెడ్గేవార్’, ‘హెగ్డేవార్’ (ఇంటి పేర్లు) రెండూ ఒకటే. . ఆద్య సర్ సంఘచాలక్ డాక్టర్జీ పూర్వీకులే కాదు, ద్వితీయ సర్ సంఘ్చాలక్ గురూజీ పూర్వీకులూ తెలుగువారే (కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతం). వీరి పూర్వీకులు వేర్వేరు సమయాల్లో మహారాష్ట్రలోని నాగపూర్కు వలసపోయి స్థిరపడ్డారు.

మహారాష్ట్రలో పుట్టిన గోదావరి తెలుగునాట మొదటిగా కందకుర్తిలోనే ప్రవేశిస్తుంది. హరిద్రా, మంజీరా నదులు ఇక్కడే గోదావరితో సంగమించడం వల్ల త్రివేణీ సంగమ స్థానమంటారు. కందకుర్తి గ్రామస్థాపనకు పూర్వం స్కందభక్తుడు భాస్కరరాయలు ఇక్కడ స్కంద దేవాలయాన్ని నిర్మించాడని ప్రతీతి. స్కంద ‘కంద’గా, కన్నడ పదం కుడితి ‘కుర్తి’గా ప్రచలితమై కందకుర్తిగా మారింది.

ఆ రోజుల్లో కందకుర్తిలోని పలువురు బ్రాహ్మణులు వేద పండితులు! వారంతా హెడ్గేవార్ వంశీకులు. అక్కడో వేద పాఠశాల ఉండేది. వేదాధ్యయనమే వారి జీవిక. వీరినే వేదశాస్త్రులనీ, దీక్షితులనీ పిలిచేవారు. యజ్ఞ యాగాదులు నిర్వహణకు హెడ్గేవార్ వంశస్థులకు దూరదూరాల్నించి పిలుపులు వచ్చేవి. అలా రాజు నుండి ఆహ్వానమందటంతో కందకుర్తికే చెందిన శ్రీధర్ మహారాజ్ మరి కొందరు వేదపండితులను వెంటబెట్టుకొని నాగపూర్ వెళ్లారు. వారిలో హెడ్గేవార్ వంశస్థుడు నరహరిశాస్త్రి సహా సంగంకర్ వంశస్థులు కూడా ఉన్నారు. నాగపూర్లోని శక్కర్నగర్లో 1-11 జూన్ 1817లో భాగవత సప్తాహం జరిగింది. దీనికి స్వయంగా రాజుగారే హాజరయి పండితుల్ని ఘనంగా సత్కరించి గజారోహణం కూడా చేయించారు. కందకుర్తి రామాలయంలో పూజారి బాధ్యతల వల్ల శ్రీధర్ మహారాజ్ తిరిగి వచ్చేశారు.

అయితే హెడ్గేవార్, సంగంకర్ వంశస్థులు నాగపూర్ లోనే స్థిరపడ్డారు. నరహరిశాస్త్రి డాక్టర్జీకి స్వయానా ముత్తాత. హెడ్గేవార్ వంశస్థులు నాగపూర్లో స్థిరపడినా ఈ ప్రాంతానికి వస్తూపోతూ ఉండేవారు. తమ కులదైవం ధర్మపురి నరసింహస్వామిని దర్శించుకొని వెళ్లేవారు. డాక్టర్జీ పెద్దన్నయ్య సీతారామశాస్త్రి రెండుసార్లు వచ్చి వెళ్లారు. కందకుర్తిలో కొలువైన కేశవరాజ్ పేరే తల్లిదండ్రులు కేశవరావ్ అని డాక్టర్జీకి పెట్టుకున్నారు.

హెడ్గేవార్ వంశీకుల ఇలవేల్పులు వెంకటేశ్వర స్వామి, కేశవరాజస్వామి, ధర్మపురి నరసింహస్వామి. వారు రుగ్వేద సకల శాఖీయ మహారాష్ట్రీయ బ్రాహ్మణ వేదపండితులు. కాశ్యప గోత్రీక•లు. తెలుగు -మహారాష్ట్ర సరిహద్దులో ఉండేవారి ఇంటి పేర్లు చాలావరకు తెలుగింటిపేర్లకు దగ్గరగా ఉంటాయి. హెడ్గేవార్ గారి వంశీయుల కులదైవమైన కేశవరాజ స్వామి ఆలయం నేటికీ ఈ గ్రామంలో ఉంది.

ఈ గ్రామంలో నివసించిన చివరి హెడ్గేవార్ వంశస్థుడు త్రయంబక్ భట్. ఈయన 1930లో ప్లేగు సోకి మరణించాడు. ఇక కందకుర్తిలో ఆ వంశస్థులెవరూ మిగలలేదు. ఆ వంశస్థులు ప్రస్తుతం నిజామాబాద్లో కొందరు ఉన్నారు. కందకుర్తి ఇంటిని స్థానికుడైన గోవిందరావ్ దుడ్డువార్కు అప్పగించి వారు నిజామాబాద్ వెళ్లిపోయారు. 1980లో వారు, శ్రీరామశాస్త్రి హెడ్గేవార్ కోరిక మేరకు ఆ ఇంటిని సంఘ్కు సమర్పించారు. ఈ వ్యవహారంలో మోరోపంత్ సంధానకర్తగా వ్యవహరించారు.

వర్తమాన సర్ సంఘ్చాలక్ డా. మోహన్జీ భాగవత్ సహా మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ ఆద్వాణీ, మాజీ సర్ సంఘ్చాలక్లు బాలాసాహెబ్ దేవరస్, ప్రొ. రాజేంద్రసింగ్ (రజ్జు భయ్యా), ఇతర పెద్దలు శ్రీకాంత్ జోషి, యాదవ్రావ్ జోషి, కెత్కర్జీ, హల్దేకర్జీ తదితరులు కందకుర్తిని దర్శించుకున్నారు. నేటికీ పలువురు ప్రముఖులు, స్వయంసేవకులు దర్శిస్తూనే ఉన్నారు.

హెడ్గేవార్ గారి స్మృత్యర్థం కందకుర్తిలో అత్యద్భుతమైన 'శ్రీ కేశవ స్ఫూర్తి మందిరం' నిర్మించబడింది.ఈరోజు అంటే ఏప్రిల్ 11, 2026న సరసంఘచాలక్ మోహన్ భగవత్ చేతుల మీదుగా ఇది ప్రారంభం కానుంది. ఈ మందిరంలో డాక్టర్ హెడ్గేవార్ మరియు భారత మాత విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. విశేషమేమిటంటే, ఈ విగ్రహాలను అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ మలిచారు. ఈ భవనం భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భుతమైన వాస్తుకళతో నిర్మితమైంది.

హెడ్గేవార్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ 'కేశవ సేవా సమితి' అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిరుపేద విద్యార్థుల కోసం సరస్వతీ శిశుమందిర్, మహిళా సాధికారత కోసం కుట్టు శిక్షణ కేంద్రాలు మరియు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అనేక సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి.

సంతోషి దహగాం

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande