
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)
ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం క్రికెట్ అభిమానులకు మరో డబుల్ ధమాకా సిద్ధంగా ఉంది. నేడు జరగనున్న మ్యాచ్లు పాయింట్ల పట్టికలో సమీకరణాలను మార్చే అవకాశం ఉండటంతో నేటి మ్యాచులపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ లవర్స్. లక్నోలో జరిగే మొదటి మ్యాచ్, ముంబై వాంఖడే వేదికగా జరిగే రెండో మ్యాచ్ ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచనున్నాయి.
మొదటి మ్యాచ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో LSG vs GT జట్ల మధ్య జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్ తమ సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్ను ఎదుర్కోనుంది. ఈ పిచ్ సాధారణంగా బౌలర్లకు, బ్యాటర్లకు సమానంగా కలిసి వస్తుంది. కానీ స్పిన్నర్లకు కొంత ఎక్కువ సహకరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్ టైటాన్స్ తన బౌలింగ్ విభాగంతో లక్నో బ్యాటర్లను కట్టడి చేయాలని చూడగా, లక్నో సొంత గడ్డపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని పట్టుదలగా ఉంది.
రెండో మ్యాచ్ ఐపీఎల్ లో అత్యంత ఆసక్తికరమైన పోరుగా భావించే ముంబై ఇండియన్స్(MI), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. వాంఖడే స్టేడియం అంటేనే పరుగుల వరద పారే వేదిక. ఇక్కడ పిచ్ బ్యాటింగ్కు ఎంతో అనుకూలిస్తుంది, కాబట్టి బౌండరీల మోత గ్యారెంటీ. ముంబై తన సొంత మైదానంలో ఫ్యాన్స్ మద్దతుతో విజృంభించాలని చూస్తుంటే, కోహ్లి సేన (RCB) బ్యాటింగ్ లైనప్ వాంఖడేలో భారీ స్కోర్లను నమోదు చేసే అవకాశం ఉంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..