
కటిహార్ ,12 ఏప్రిల్ (హి.స.)
బిహార్ లోని కటిహార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్టు సమాచారం. కోడా బ్లాక్లోని జాతీయ రహదారి NH-31పై గెరాబారి-బస్గత్తా చౌక్ సమీపంలో ఒక బస్సు, ట్రక్కు, పికప్ వ్యాన్ ఒకదానికొకటి బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృతి చెందగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
మరణించిన వారిలో పూర్ణియా జిల్లా నుండి పికప్ వ్యాన్లో వస్తున్న ప్రయాణికులే ఎక్కువ ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, ఎస్పీ శిఖర్ చౌదరి నేతృత్వంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ విషాద ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రు. 50,000 చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు కేంద్ర ప్రభుత్వం సహాయపడుతుందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..