విజయవాడ కలెక్టరేట్లో హైడ్రామా.. ఉద్యోగులపై కారం చల్లిన వృద్ధురాలు
విజయవాడ కలెక్టరేట్లో భూసేకరణ విభాగంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిహారం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు ఆగ్రహంతో ఉద్యోగులపై కారం చల్లిన సంఘటన చర్చనీయాంశమైంది.
Vijayawada


విజయవాడ, 13 ఏప్రిల్ (హి.స.)విజయవాడ కలెక్టరేట్లో భూసేకరణ విభాగంలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిహారం కోసం వచ్చిన ఓ వృద్ధురాలు ఆగ్రహంతో ఉద్యోగులపై కారం చల్లిన సంఘటన చర్చనీయాంశమైంది. విజయవాడ కలెక్టరేట్లో భూసేకరణ విభాగానికి చెందిన కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన వెలగపూడి లక్ష్మీ తులసి అనే వృద్ధురాలు తన భూమి పరిహారం కోసం కార్యాలయానికి వచ్చారు. అయితే అధికారులు సరైన స్పందన ఇవ్వలేదని భావించిన ఆమె ఒక్కసారిగా ఆగ్రహానికి లోనై అక్కడి ఉద్యోగులపై కారం చల్లినట్లు సమాచారం. దీంతో ఉద్యోగులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.

బాధితురాలు లక్ష్మీ తులసి తెలిపిన వివరాల ప్రకారం.. 2003లో రహదారి విస్తరణ కోసం తన భూమిని తీసుకున్నారు. ఇప్పటివరకు పరిహారం అందలేదని ఆరోపించారు. సుమారు 2 సెంట్ల 20 గజాల భూమి రోడ్డు విస్తరణలో పోయిందని తెలిపారు. దానికి రూ.24 లక్షలు పరిహారం రావాల్సి ఉందని చెప్పారు.

భూసేకరణ విభాగం అధికారులు బాధితురాలిని పిలిపించి మాట్లాడారు. రికార్డులను పరిశీలించిన అనంతరం, ఈ భూమి పరిహారం వ్యవహారం జాతీయ రహదారుల సంస్థకు సంబంధించినదని తెలిపారు. అందువల్ల తమ పరిధిలోకి ఈ కేసు రాదని, సంబంధిత జాతీయ రహదారుల సంస్థ అధికారులను సంప్రదించాలని సూచించారు.

చాలాకాలంగా పరిహారం కోసం తిరుగుతున్నానని వృద్ధురాలు లక్ష్మీ తులసి ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆగ్రహానికి గురై ఈ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో కాసేపు కలెక్టరేట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విజయవాడ కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటన భూసేకరణ పరిహారం సమస్యలపై మరోసారి దృష్టి సారించింది. బాధితులకు సమయానికి పరిహారం అందకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande