
హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు, రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేయడంలో భాగంగా పేద రోగులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏటీఎంల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే దాదాపు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు.
ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్లోని కింగ్ కోఠి, మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభించారు. అక్కడ ఈ యంత్రాలు అద్భుతమైన ఫలితాలను ఇవ్వడంతో అధికారులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. హెల్త్ ఏటీఎంల ద్వారా వచ్చిన పరీక్ష ఫలితాలను, టీ-డయాగ్నోస్టిక్స్, ప్రముఖ ప్రైవేట్ ల్యాబ్ల రిపోర్టులతో పోల్చి చూడగా, ఫలితాల్లో కచ్చితత్వం ఉండటంతో ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పేద, సామాన్య ప్రజలకు వేల రూపాయలు ఖర్చయ్యే కీలక వైద్య పరీక్షలు ఇకపై సులభంగా, వేగంగా అందనున్నాయి.
క్లౌడ్ ఆధారిత టెక్నాలజీతో పనిచేసే ఈ హెల్త్ ఏటీఎంల ద్వారా బీపీ, ఈసీజీ, శరీరంలోని కొవ్వు శాతం, ఆక్సిజన్ స్థాయులు, ఉష్ణోగ్రత వంటి 65 రకాల ప్రాథమిక పరీక్షలను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. వీటితో పాటు రక్త నమూనాల ద్వారా గ్లూకోజ్, హిమోగ్లోబిన్, లిపిడ్ ప్రొఫైల్, కాలేయం, కిడ్నీ పనితీరు, థైరాయిడ్ వంటి కీలక పరీక్షలు కూడా నిర్వహిస్తారు. అంతేగాక గర్భిణుల కోసం ఫీటల్ డాప్లర్, చర్మ వ్యాధుల నిర్ధారణకు డెర్మాస్కోప్ వంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi