
అమరావతి, 13 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పరిశ్రమల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసేందుకు, అనవసర నిబంధనలను తొలగించేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 ప్రతిపాదనలపై సోమవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, పారిశ్రామిక అనుమతుల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ పలు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ వేగాన్ని, ఆలోచనా విధానాన్ని చూసి కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన దానికంటే రాష్ట్రం ఎంతో ముందుందని ప్రశంసించారు.
డీ-రెగ్యులేషన్ ఫేజ్-3ని ఎప్పుడు ప్రారంభిస్తారని సీఎం ఆరా తీయగా, జూన్ నుంచి దానిపై కసరత్తు చేస్తామని సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ఫేజ్-3లో టెక్నాలజీ అనుసంధానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్స్ వినియోగానికి పెద్దపీట వేయాలని చంద్రబాబు సూచించారు. తాము ఇప్పటికే డేటా లేక్, రియల్ టైం డేటా, సీఎఫ్ఎంఎస్, అవేర్-2.0, వాట్సాప్ గవర్నెన్స్ వంటి అధునాతన వ్యవస్థలను వినియోగిస్తున్నామని కేంద్ర బృందానికి వివరించారు.
800 నిబంధనలు ఇక 100కి కుదింపు
ప్రస్తుతం పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకిగా ఉన్న 800కు పైగా నిబంధనలను కేవలం 100 లోపునకు కుదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, పర్మిషన్లు, లైసెన్సుల సంఖ్యను సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలని స్పష్టం చేశారు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా చూడాలని, డబుల్ లైసెన్సింగ్ వంటి పద్ధతులను పూర్తిగా తొలగించాలని సూచించారు.
ఈ సంస్కరణలన్నింటినీ మే నెలాఖరులోగా అమల్లోకి తెచ్చేందుకు వీలుగా అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆదేశించారు. దరఖాస్తు స్వీకరణ నుంచి అనుమతుల జారీ వరకు మొత్తం ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయాలని, తద్వారా పారదర్శకతను పెంచాలని నిర్దేశించారు. ఈ మార్పుల వల్ల పరిశ్రమల ఏర్పాటుకు పట్టే సమయంలో 40 శాతం ఆదా కావాలని లక్ష్యంగా నిర్దేశించారు.
అయితే, నిబంధనల సరళీకరణ పేరుతో ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. వేధింపులకు ఆస్కారం లేని విధంగా థర్డ్ పార్టీ తనిఖీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక నిబంధనలు రూపొందించాలని ఆదేశించారు. అటవీ చట్టాలను కూడా వీలైనంత సరళీకృతం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ నుంచి ఒక అడుగు ముందుకేసి ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అదే రీతిలో, ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ను పాటిస్తున్నామని వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi