
అమరావతి, 13 ఏప్రిల్ (హి.స.)
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం మీదుగా వెళుతున్న మూడు ప్రధాన పారిశ్రామిక కారిడార్ల వెంట కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.31 లక్షల ఎకరాల భూమిని కూడా గుర్తించింది. ఇప్పటికే ఉన్న 20 క్లస్టర్లకు ఇవి అదనం. ఈ కొత్త క్లస్టర్లు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో మొత్తం పారిశ్రామిక క్లస్టర్ల సంఖ్య 50కి చేరనుంది.
రాష్ట్రంలో ఇప్పటికే విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖ-చెన్నై కారిడార్ మొదటి దశ పనులు ముగింపు దశకు చేరుకోగా, మిగిలిన రెండు కారిడార్ల పరిధిలోని తిరుపతి, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పారిశ్రామిక నోడ్ల అభివృద్ధి కొనసాగుతోంది. ఈ కారిడార్ల వెంబడి పారిశ్రామిక వాతావరణాన్ని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త క్లస్టర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ 30 క్లస్టర్ల కోసం అధికారులు ముంపు, తీర ప్రాంతాల్లోని భూములపై దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 74,583 ఎకరాల ముంపు భూముల్లో ఇప్పటికే 27,000 ఎకరాలు, తీరప్రాంతంలోని 56,608 ఎకరాల్లో 36,434 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఈ భూముల్లో ముంపు ప్రాంతాల్లో 15, తీర ప్రాంతంలో మరో 15 క్లస్టర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా సముద్ర వాణిజ్యం, మారిటైం సంబంధిత పరిశ్రమలను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ కొత్త క్లస్టర్లను శ్రీకాకుళం, విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు, అనంతపురం సహా పలు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడం ద్వారా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. కేంద్రం నిధులు కేటాయించనుండగా, అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను భరించనుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రం పూర్తిగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi