
హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)
వాతావరణ శాఖ అంచనాలకు తగ్గట్లుగానే తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. రాబోయే ఏడు రోజుల పాటు ఎండ తీవ్రత అసాధారణంగా ఉండబోతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వడగాల్పులు (Heat Waves) వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సూర్యుడు ప్రతాపం చూపనున్నాడు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42°C నుండి 45°C వరకు నమోదయ్యే ప్రమాదం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉండటంతో, మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావడం క్షేమకరం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని హైదరాబాద్లో పాటు పరిసర జిల్లాల్లో కూడా ఉక్కపోత తీవ్రంగా ఉంటుందని, గాలిలో తేమ శాతం తగ్గడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ వారం రోజులు 'హీట్ ఇండెక్స్' ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తగినంత నీరు, మజ్జిగ, ద్రవ పదార్థాలు తీసుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు లేదా టోపీ వంటి రక్షణ కవచాలను వాడాలని సూచిస్తున్నారు.
రైతులు బయట పనిచేసే కూలీలు ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయాల్లోనే పనులు ముగించుకోవాలని నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు