సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించేలా.. రైతుకు అండగా నిలిచేలా
ఏలూరు రైతు సంపద’ పోర్టల్కు కలెక్టర్ శ్రీకారం
Eluru collector


ఏలూరు, 14 ఏప్రిల్ (హి.స.)సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించడం, నాణ్యమైన ఆహార ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించడమే లక్ష్యంగా ఏలూరు కలెక్టర్ వెట్రిసెల్వి చొరవ తీసుకున్నారు. ‘ఏలూరు రైతు సంపద’ డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా జిల్లాలో సేంద్రియ సేద్యం చేస్తున్న అన్నదాతలు వారు పండించే ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. ప్రస్తుతం మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించడం, రైతు-వినియోగదారులకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక ప్లాట్ఫాంను కలెక్టర్ ఏర్పాటు చేయించారు. వెబ్సైట్లో అప్లోడ్ అయ్యే ఉత్పత్తులను జిల్లా వ్యవసాయ-ఉద్యానశాఖలు ధ్రువీకరిస్తాయి. దాంతో వినియోగదారులు నేరుగా పోర్టల్లోకి వెళ్లి కావాల్సిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుని రైతుతో మాట్లాడి తీసుకోవచ్చు.

సృజనాత్మక ఆలోచనలో భాగంగా

వచ్చే సమావేశం నాటికి ప్రతి కలెక్టర్ ఒక సృజనాత్మక ఆలోచనతో రావాలని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా ఏలూరు కలెక్టర్ ఈ వెబ్సైట్ రూపకల్పనకు చొరవ తీసుకున్నారు. జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ అధికారులను సమన్వయం చేసుకుని దీన్ని రూపొందించారు. ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు ఆన్లైన్లో చెల్లింపులు చేయటానికి క్యూఆర్ కోడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. దూర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా బుక్ చేసుకుంటే వారికి సరకులు పంపటానికి కార్గో బస్సులు, పార్సిల్ సర్వీసులు సులభతరం చేయాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్యాకింగ్, బ్రాండింగ్, లేబులింగ్, సర్టిఫికేషన్పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో దీన్ని ప్రజంట్ చేయనున్నారు.

250 రకాల ఉత్పత్తులు: జిల్లాలో 50 వేల ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తున్నారు. కూరగాయలు, పండ్లు, పప్పులు, చిరు ధాన్యాలు, వంటనూనెలు, కొబ్బరినూనె, మసాలా దినుసులు, హోమ్మేడ్ చాక్లెట్లు, బెల్లం, పొడులు వంటి సుమారు 250 రకాల ఉత్పత్తులను 500 మంది రైతులు అప్లోడ్ చేశారు. ఈ నెల 18 లేదా 19న ఏలూరులో రైతు సంపద ఉత్పత్తుల భారీ మేళాను ఏర్పాటు చేసి ఈ వేదికను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలో ఆయా శాఖల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులు రైతుల ఉత్పత్తులను ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోవాలని పీజీఆర్ఎస్కు హాజరైన అధికారులకు కలెక్టర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande