ఆర్టీసీని కాపాడుకుందాం.. సమ్మె విరమించండి: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక పిలుపు
ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె నిర్ణయం సరైంది కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
పొన్నం


హైదరాబాద్, 14 ఏప్రిల్ (హి.స.)

ఆర్టీసీ సంస్థను కాపాడుకోవాల్సిన

బాధ్యత అందరిపై ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె నిర్ణయం సరైంది కాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఇవాళ ఆయన కీలక ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై గత ప్రభుత్వం హడావిడిగా నిర్ణయం తీసుకుందని మంత్రి విమర్శించారు. ప్రస్తుతం ఈ అంశంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం చేస్తోందని, సంస్థ ఆర్థిక స్థితిగతులను బట్టి కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. విలీనం, కార్మిక సంఘాల గుర్తింపు మినహా మిగిలిన అన్ని సమస్యలపై చర్చించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తన తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు.

గతంలో ఉన్న రూ.1205 కోట్ల పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు, రూ.690 కోట్ల CCS బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని మంత్రి ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే 2978 కొత్త బస్సులను ప్రవేశపెట్టామని, 1134 మందికి కారుణ్య నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా చివరి దశలో ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ ఉనికి ప్రశ్నార్థకం కాలేదని, పైగా 90కి పైగా డిపోలు ఇప్పుడు లాభాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. ఇటీవలే 2.1 శాతం డీఏ అమలు చేశామని, పీఆర్సీ అంశం కూడా పరిశీలనలో ఉందని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం అనే మూడు సూత్రాలతో తమ ప్రభుత్వం పని చేస్తోందని, కార్మికులు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమ్మె ఆలోచన విరమించుకోవాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande