
కర్నూలు, 15 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రాణాధారమైన తుంగభద్ర డ్యాం నూతన క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏపీ జలవనరుల శాఖ (మెకానికల్ విభాగం) సలహాదారుడు, గేట్ల నిపుణుడు ఎన్.కన్నయ్యనాయుడు గేట్ల ఏర్పాటు పనులను పరిశీలించారు. టీబీపీ బోర్డు ఎస్ఈ నారాయణనాయక్, బోర్డు ఇంజనీర్ల పర్యవేక్షణలో గుజరాత్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ సంస్థ క్రస్ట్గేట్లు తయారి(ఫ్యాబ్రికేషన్), అమర్చడం (ఎరక్షన్) పనులు చేపట్టింది. గత డిసెంబరు 6న గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టి కేవలం 129 రోజుల్లో 25 గేట్లు పూర్తిగా ఏర్పాటు చేయడమే కాకుండా 22 గేట్లు ట్రైల్రన్ కూడా పూర్తి చేశారు. మిగిలిన ఐదు గేట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కన్నయ్య నాయుడు ప్రతిగేటును క్షుణంగా పరిశీలించి, టీబీపీ బోర్డు ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. . ఈ సందర్భంగా కన్నయ్యనాయుడు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రత్యేక కృషి, కర్ణాటక ప్రభుత్వ సహకారం, రైతుల త్యాగం వల్లే రికార్డు స్థాయిలో గేట్ల ఏర్పాటు సాధ్యమవుతోందని చెప్పారు. మే 15లోగా మొత్తం గేట్ల ఏర్పాటు పూర్తవుతుందని, ఏమైనా చిన్నచిన్న పనులు మిగిలితే ఆ నెలాఖరులోగా పూర్తి చేస్తామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ