
అమరావతి, 15 ఏప్రిల్ (హి.స.)ఎవరెస్టు బేస్ క్యాంపు అధిరోహించేందుకు రాష్ట్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు సిద్ధమయ్యారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 8 మంది బాలికలు సహా 21 మంది విద్యార్థుల బృందం ఎవరెస్టు బేస్ క్యాంప్ అధిరోహణ యాత్ర చేపట్టనుంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు ఈ సాహసయాత్ర సాగనుంది. 5364 మీటర్ల ఎత్తులో ఉన్న బేస్ క్యాంప్ను రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అధిరోహించనున్నారు. 15వ తేదీ(నేడు) మధ్యాహ్నం నేపాల్ రాజధాని ఖఠ్మాండూకు చేరుకుంటారు. అక్కడి నుంచి పర్వతారోహణ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని ఆయన నివాసంలో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ యాత్రకు జిల్లాల నుంచి పోటీలు నిర్వహించి ఫైనల్గా 21 మందిని యాత్రకు ఎంపిక చేశారు. మార్చిలో లద్దాఖ్లో వారికి ప్రాక్టీస్ ఇప్పించారు. అక్కడి పరిస్థితులకు అలవాటయ్యేలా 12 రోజులు శిక్షణ ఇచ్చారు. అనంతరం గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ ఇచ్చి యాత్రకు సంసిద్ధుల్ని చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. పలు సూచనలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ