
బెంగళూరు, 15 ఏప్రిల్ (హి.స.)బెంగళూరు నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కూతురిని ఓ తల్లే కిరాతకంగా హతమార్చి, ఆ తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడింది. వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమ్మెడిహళ్లిలో మంగళవారం ఉదయం ఈ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సువర్ణ భర్త చంద్రశేఖర్ ఉదయం యథావిధిగా విధులకు వెళ్లారు. ఆ తర్వాత భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు. దీంతో అనుమానం వచ్చి, దగ్గర్లో ఉన్న తన సోదరుడిని ఇంటికి వెళ్లి చూడమని కోరారు. ఉదయం 11 గంటల సమయంలో అతడు ఇంటికి వెళ్లి చూడగా, గదిలో కారుణ్య విగతజీవిగా పడి ఉండగా, సువర్ణ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది.
సమాచారం అందుకున్న వైట్ఫీల్డ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపిన తర్వాత, సువర్ణ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే, ఆర్థిక సమస్యల కారణంగా సువర్ణ తీవ్రమైన మనోవేదనకు గురై ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని ఆమె సోదరి ఉష అనుమానం వ్యక్తం చేశారు. ఖర్చులు పెరిగిపోతున్నాయని, కుటుంబాన్ని నడపడం కష్టంగా ఉందని సువర్ణ తనతో చెప్పినట్లు ఆమె తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. తన కుమార్తెను భార్యే హత్య చేసిందని భర్త చంద్రశేఖర్ ఫిర్యాదు చేయగా, సువర్ణ మృతిపై ఆమె సోదరుడు మంజునాథ్ అనుమానాలు వ్యక్తం చేస్తూ మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi