
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ
ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కావాలనే వక్రీకరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్రావు మండిపడ్డారు. ఈ విషయంలో జరుగుతున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, వాస్తవాలను భూతద్దంలో చూపిస్తూ రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు. తేజస్వి సూర్య వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం వేరని, దానిని తప్పుగా అర్థం చేసుకుని రాద్ధాంతం చేస్తున్నారని రాంచందర్రావు పేర్కొన్నారు. తేజస్వి మాటలను భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశం తెలంగాణను కించపరచడం కాదు అని స్పష్టం చేశారు. విభజన సమయంలో జరిగిన అశాస్త్రీయ ధోరణిని లేదా రాజకీయ పరిణామాలను ప్రస్తావించి ఉండవచ్చని, కానీ బీఆర్ఎస్ నేతలు దానిని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్రను ఎవరూ విస్మరించలేరని ఆయన గుర్తుచేశారు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? పార్లమెంట్లో నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ సంపూర్ణ మద్దతు ఇవ్వబట్టే రాష్ట్రం సాధ్యమైంది అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం క్రెడిట్ మొత్తం తమదేనని చెప్పుకునే బీఆర్ఎస్కు (నాడు టీఆర్ఎస్) పార్లమెంట్లో ఉన్న బలం ఎంత అని ఆయన ప్రశ్నించారు. లోక్సభలో తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్కు కనీసం ఇద్దరు సభ్యులు కూడా లేరు. మరి రాష్ట్రం ఎలా వచ్చిందో ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు యూటర్న్ తీసుకుందని, ఆ పార్టీ ద్వంద్వ వైఖరి వల్లనే ఉద్యమం సుదీర్ఘకాలం కొనసాగిందని రాంచందర్రావు ఆరోపించారు. రాష్ట్రం ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్న కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతలు విమర్శలు పక్కన పెట్టి వాస్తవాలను గ్రహించాలని, తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్రను గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..