
ఖమ్మం, 17 ఏప్రిల్ (హి.స.)
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు
రామదాస్ నాయక్ ప్రత్యేక చొరవతో ఏన్కూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాల ఏర్పాటుకు అవసరమైన సౌకర్యాలు, వసతులపై సమగ్రంగా పరిశీలించేందుకు జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ పాఠశాల శుక్రవారం ఆవరణను సందర్శించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి నాగిరెడ్డి, పంచాయతీరాజ్ డిఇ కరుణాకర్ రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో కృష్ణ, ఏఈ సూర్యనారాయణలతో కలిసి అవసరమైన వసతులపై వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల వాతావరణాన్ని పూర్తిగా పరిశీలిస్తూ, విద్యార్థులకు అనుకూలంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రాంతంలో గిరిజన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉండటంతో, వారు సుదూర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించారు. ఈ నేపథ్యంలో స్థానిక విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ప్రత్యేక శ్రద్ధతో ఈ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పాఠశాల పరిశీలనలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీజతో పాటు ప్రధానోపాధ్యాయురాలు వాసవి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న షాపింగ్ కాంప్లెక్స్కు సంబంధించిన అద్దెలను సక్రమంగా వసూలు చేయాలని గ్రామస్తులు అదనపు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కొన్ని షాపులపై సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు అద్దె బకాయిలు ఉన్నాయని, నెలనెలా అద్దెలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేయనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు