
కామారెడ్డి, 17 ఏప్రిల్ (హి.స.) కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని సమీక్షించిన ఆయన, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రతి వరి సంచికి 40.600 కిలోల తూకం ఖచ్చితంగా ఉండేలా కొలవాలని, తూకం ప్రక్రియలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆదేశించారు. అనంతరం సన్న ధాన్యం నాణ్యతను యంత్రాల ద్వారా పరీక్షించి, తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రంలో తాగునీరు, నిల్వ సదుపాయాలు తదితర మౌలిక వసతులు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు