
కామారెడ్డి, 17 ఏప్రిల్ (హి.స.)
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దీను సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బిచ్కుందలోని తన అద్దె ఇంట్లో ఫిర్యాదుడి నుంచి అధికారిక సహాయం పేరుతో ఇన్స్పెక్టర్ లంచం తీసుకున్నారు. గ్రామాల నుంచి కల్లు దుకాణాలు తరలించేలా ఒత్తిడి చేయకుండా ఉండేందుకు, మరిన్ని కేసులు నమోదు చేయకుండా కల్లు దుకాణాలు యథావిధిగా నడిచేలా చూస్తానని చెప్పి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. తనిఖీల్లో అతని బ్యాగులో లెక్కల్లో చూపని రూ.45,760 నగదు కూడా లభ్యమైంది అని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
నిందిత అధికారిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని హైదరాబాద్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ట్రయల్ ఆఫ్ SPE & ACB కేసెస్ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాది వివరాలు గోప్యంగా ఉంచారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు