
హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మెట్రో స్టేషన్లలో ఒకటైన ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఈరోజు(శుక్రవారం) బాంబు బెదిరింపు వచ్చింది. ఈ ఘటన భాగ్యనగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన బెదిరింపు కాల్తో పోలీసులు, మెట్రో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ వేళాది మంది ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. ఈ క్రమంలోనే పోలీసు కంట్రోల్ రూంకు ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ ఆవరణలో బాంబు పెట్టామని, అది కాసేపట్లో పేలిపోతుందని ఆగంతకుడు బెదిరించాడు. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెట్రో సెక్యూరిటీ విభాగం ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
బెదిరింపు కాల్ వచ్చిన వెంటనే బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ స్టేషన్కు చేరుకున్నాయి. స్టేషన్ లోపల ఉన్న డస్ట్ బిన్లు, పార్కింగ్ ఏరియా, టికెట్ కౌంటర్ల వద్ద నిశితంగా తనిఖీలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా, స్టేషన్లో ఉన్న ప్రయాణికులను వెంటనే బయటకు పంపించివేశారు. కాసేపు మెట్రో రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. అనుమానాస్పద బ్యాగులు లేదా వస్తువుల కోసం ప్రతి అంగుళాన్ని పోలీసులు తనిఖీ చేశారు.
ప్రత్యేక బలగాల ప్రాథమిక తనిఖీల అనంతరం స్టేషన్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఫేక్ కాల్గా పోలీసులు నిర్ధారించారు. నగరంలో భయాందోళనలు సృష్టించేందుకు ఎవరో కావాలనే ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో ట్రేసింగ్ చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్