ఏరోస్పేస్’ వ్యూహాత్మక కేంద్రంగా తెలంగాణ...
ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు
Jazeera Airways


హైదరాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)‘

భవిష్యత్తు ‘ఏరోస్పేస్’ రంగ అవసరాలకు అనుగుణంగా ‘తెలంగాణ’ను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్అండ్ డీ, అడ్వాన్డ్స్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియెన్స్... ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ‘ఏరోస్పేస్’ లో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతాయన్నారు. ఆ దిశగా... ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ‘ఎకో సిస్టం’ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శుక్రవారం ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలీలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ‘ఛేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్ ; ఆర్ అండ్ డీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్’ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ‘ఏరోస్పేస్’ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ రంగంలో ఒకప్పుడు... యూఎస్, రష్యా, ఐరోపా దేశాలదే ఆధిపత్యం చెలాయించేవని, ఇప్పుడు వాటికి ధీటుగా ‘గ్లోబల్ సప్లై చైన్’లో మన దేశం కూడా ‘కీ’ రోల్ ప్లే చేస్తోందన్నారు. యునెస్కో గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైంటిస్టులు, ఇంజనీర్లు మన దేశంలోనే ఉన్నారన్నారు. కానీ... మెకిన్సే నివేదిక ప్రకారం.. ల్యాబ్‌ల్లో జరిగే పరిశోధనల్లో 30 శాతం కూడా కమర్షియల్ మాన్యుఫ్యాక్చరింగ్ కు నోచుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిశోధనల్ని ఉత్పత్తులుగా మార్చాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని, ఆ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నామన్నారు. డెలాయిట్ గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సర్వే ప్రకారం... నేడు 74 శాతం మంది ఏరోస్పేస్ సీఈఓలు కేవలం తక్కువ ఖర్చు కంటే పటిష్ఠమైన సప్లై-చైన్, తయారీ సామర్థ్యానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాబోయే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త ఎయిర్ క్ట్రాఫ్ట్స్ అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్‌బస్ సంస్థలు అంచనా వేశాయన్నారు. ఈ డిమాండ్‌ను ‘హైదరాబాద్’ అందిపుచ్చుకునేలా ఇప్పటికే ఇక్కడున్న ప్రిసిషన్ ఇంజనీరింగ్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ నెట్‌వర్క్, బలమైన ఎంఎస్ఎంఈ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. ఇప్పటికీ మనం ఏరోస్పేస్ టెస్టింగ్, సర్టిఫికేషన్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఫలితంగా ఖర్చు పెరగడమే కాకుండా... ఉత్పత్తుల గ్రౌండింగ్ కు 18 నెలల నుంచి 24 నెలల వరకు అదనపు సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయి సర్టిఫికేషన్ ఎకో సిస్టంను అభివృద్ధి చేసేందుకు ‘హైదరాబాద్’ అన్ని రకాలుగా అనుకూలంగా ఉందని... ఆ దిశగా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరముందన్నారు. డ్రోన్లు, రీయూజబుల్ రాకెట్లు, ఏఐ ఏవియానిక్స్, 3డీ ప్రింటింగ్, అడ్వాన్డ్స్ మెటీరియల్స్ తదితర అంశాలు రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ భవిష్యత్తును శాసిస్తాయన్నారు. అందుకు అనుగుణంగానే... ఇప్పటి నుంచే ‘తెలంగాణ’ను సిద్ధం చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ దిగ్గజ సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తూ ‘మేడిన్ తెలంగాణ’ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఆర్అండ్ డీ ఇన్సిట్యూషన్లు, గ్లోబల్ ఓఈఎంలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఆదిభట్ల ఏరోస్పేస్ ఎస్‌ఈజెడ్, ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, రోడ్డు నెట్ వర్క్ తదితర మౌలిక సదుపాయాలు, టాలెంట్ పూల్... ప్రపంచ ఏరో స్పేస్ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూసేలా చేశాయన్నారు. ‘హైదరాబాద్’ వేదికగా ఏరో స్పేస్ భవిష్యత్తును నిర్మించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలను మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. అనంతరం ఏరోస్పేస్ రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలు, ప్రముఖులను ఆయన ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యులు డా.వీకే సారస్వత్, డీజీ సీఎస్ఐఆర్ అండ్ డీఎస్ఐఆర్ సెక్రటరీ డీ.ఎన్ కళైసెల్వి, ‘ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ప్రతినిధులు డా.సతీష్ రెడ్డి, డా.సోమనాథ్, రాజబాబు, డా.శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande