
హైదరాబాద్, 16 ఏప్రిల్ (హి.స.)తెలంగాణలో కులాల వివరాలన్నింటినీ రేవంత్ సర్కారు ఎట్టకేలకు బహిర్గతం చేసింది. గతేడాది ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా రాష్ట్రంలో ప్రతి కులం, జనాభా ఎంతో స్పష్టంగా తెలిపే సమాచారాన్ని వెల్లడించింది. కులగణనలో సేకరించిన ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాలను ప్రజల ముందు ఉంచింది. స్థూలంగా చూస్తే... రాష్ట్రవ్యాప్తంగా మొత్తం జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నారు. ఇందులో 10.08 శాతం వెనకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం, ఎస్టీలు 10.45, ఓసీలు 15.79 శాతం ఉన్నట్లు తెలిపింది. ఓసీల్లో జనాభా పరంగా రెడ్లదే అగ్రస్థానం. ఓసీల్లో వారు 30.47 శాతం ఉన్నారు. తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.08 ఉండగా.. వైశ్యులు 9.07 శాతం, కమ్మవారు 6.56 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు 5.98 శాతం, వెలమలు 2.56 శాతం ఉన్నారు. కాగా, కులం పేరు వెల్లడించనివారు ఓసీల్లో 21.49 శాతం ఉండటం విశేషం. వీరు మొత్తంగా 12 లక్షల పైచిలుకు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విద్య, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, కార్లు, ఇలాంటి వాటిలో అగ్రకులాల వారే ముందున్నారు. వీరిలో భూములు అత్యధికంగా రెడ్ల చేతిలో ఉన్నాయి. ఆ తరువాత వరుసగా యాదవ, లంబాడ, ముదిరాజ్, మాదిగ, మున్నూరుకాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నారు.
వెనుకబాటుతనం పరంగా రాష్ట్రంలోని 56 ప్రధాన కులాల మధ్య భారీ అసమానతలు ఉన్నాయి. బీసీల్లోని కొన్ని వర్గాలైతే సామాజికంగా, ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమాన స్థాయిలో ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్ర వెనుకబాటుతనం సగటుతో పోల్చితే ఎస్సీ క్రైస్తవులు, కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నారు. కాగా, కులాంతర వివాహాలు చేసుకుంటున్నవారు అన్ని కులాల్లోనూ పెరుగుతున్నారు. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున.. తెలంగాణ కులగణనపై పార్లమెంటులో చర్చ జరగాలని ఈ వివరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి పొన్నం తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్