
అమరావతి, 16 ఏప్రిల్ (హి.స.)భారతదేశం ఈరోజు నారీ శక్తిని గౌరవిస్తూ దేశంలోని మహిళలు వివిధ రంగాల్లో సాధిస్తున్న అసాధారణ విజయాలను వేడుక చేసుకుంటోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పార్లమెంట్లో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు. చెస్ బోర్డు నుంచి ఒలింపిక్ పోడియం వరకు భారతీయ మహిళలు దేశానికి స్ఫూర్తిని అందిస్తున్నారని తెలిపారు. ఇటీవల సైప్రస్లో జరిగిన మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్లో ఆర్.వైశాలి చరిత్ర సృష్టించారని అన్నారు. ఈ టోర్నమెంట్ గెలుచుకుని, మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో పోటీపడే అర్హత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచారన్నారు. ఈ విజయం భారత మహిళల ప్రపంచ స్థాయి ప్రతిభను మరోసారి నిరూపించిందన్నారు.
గౌరవనీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీ బలోపేతం చేసిన పరిపాలన, ప్రజా సేవ నుంచి నారీ శక్తి ప్రయాణం.. భారత అంతరిక్ష యాత్రల్లో రితు కరిధాల్ ప్రదర్శించిన శాస్త్రీయ నైపుణ్యం వరకు విస్తరించిందన్నారు. అలాగే ప్రపంచ బాక్సింగ్ వేదికపై ఆధిపత్యం చెలాయించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన నిఖత్ జరీన్ క్రీడా నైపుణ్యం కూడా.. ఈ సాధికారత ప్రయాణం భారతదేశ రాజ్యాంగ పునాదులలో లోతుగా పాతుకుపోయిందని చెప్పారు. దక్షాయణి వేలాయుధం, హంసా మెహతా, దుర్గాబాయి దేశ్ముఖ్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమృత్ కౌర్ వంటి రాజ్యాంగ వ్యవస్థాపక మాతృమూర్తులు ఈ పునాదులను తీర్చిదిద్దారన్నారు. వారి కృషి తరతరాల భారతీయ మహిళలకు న్యాయం, సమానత్వాన్ని అందించిందని పవన్ పేర్కొన్నారు.
ప్రతిభకు అవకాశం లభిస్తే మహిళలు నాయకత్వం వహిస్తారని, రాణిస్తారని, దేశాలకు స్ఫూర్తినిస్తారని చరిత్ర చెబుతోందని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ స్ఫూర్తితోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘నారీ శక్తి వందన అధినియమ్’ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారని తెలిపారు. శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా పరిపాలనలో వారికి న్యాయమైన స్థానం కల్పించే దిశగా ఇది చరిత్రాత్మక అడుగుగా నిలుస్తుందన్నారు. జనసేన పార్టీ మహిళా సాధికారత కోసం కేవలం మాటలతో కాకుండా చేతలతో ఎప్పుడూ దృఢంగా నిలబడిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిబద్ధత, సమాన అవకాశాలు, న్యాయమైన ప్రాతినిధ్యం పట్ల జనసేనకు ఉన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు.
మహిళలే సమాజానికి పునాది అని... కుటుంబాలను పోషించడం నుంచి దేశాన్ని తీర్చిదిద్దడం వరకు వారి పాత్రకు ప్రత్యామ్నాయం లేదని అన్నారు. ఒక మహిళ ఉన్నత స్థాయికి ఎదిగితే దేశం కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇది కొత్త హక్కులు ప్రసాదించడం కాదని.. మహిళలకు న్యాయబద్ధంగా చెందాల్సిన వాటిని పునరుద్ధరించడమే అని స్పష్టం చేశారు. బలమైన మహిళలు బలమైన కుటుంబాలను, బలమైన కుటుంబాలు బలమైన దేశాన్ని నిర్మిస్తాయన్నారు. ఇకపై ‘నారీ శక్తి’ కేవలం నినాదంగా మిగిలిపోదని.. అది మన నాగరికతకు బలమైన శక్తిగా నిలుస్తుందన్నారు. న్యాయబద్ధమైన, సమానమైన, సాధికారత కలిగిన భారతదేశాన్ని నిర్మించే దిశగా ‘శక్తి’ స్ఫూర్తితో ముందుకు సాగాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్